“దేవుడా !పోను పోను ఈ ప్రపంచంలో మేధావిగా బతకడం చాలా కష్టమైపోతోంది. ఇక్కడ ఏవీ తెలియని వెర్రి వెధవ లా బతకాలి, లేకపోతే ఏవీ పట్టించుకోని సన్నాసి లా బతకాలి. కానీ, ఇలా ‘మేధావి’ గా బతకడం చాలా కష్టం.”, అనుకున్నాడు సో. లో. మేధావి.
ఈ రోజుకి, అతను ఇలా అనుకోవడం, బహుశా, అరవై ఆరోసారి !
అలా మళ్ళీ అనుకుంటూ, పవన్ కళ్యాణ్ లా ఈసారి చివర్న “హు.. హు..” అని కూడా కలిపాడు. అయినా, చుట్టూ ఉన్న ఎవరూ పట్టించుకోక పోవడం వలన, తాను అనుకున్న effect రాలేదని అతనికి అర్థం అయ్యింది. అందుకే, ఓసారి కింద చూసి, మళ్ళీ ‘శూన్యమ్ ‘ లోకి చూస్తూ కూర్చున్నాడు. ఇలా చూడడం కూడా ‘మేధావితనం’ లో ఒక భాగమని , ఈ మధ్య టీవీ లో ఒక ప్రవచన చక్రవర్తి చెప్పాడట !
అప్పటికే, సో.లో. బుర్ర రకరకాల ఆలోచనలతో వేడెక్కి పోయింది – మానవుడు ‘సంఘజీవి’ అన్నారు కదా ? ఇక్కడ బతకాలంటే మనం చెప్పింది పక్కవాడికి ‘అర్థం’ కావాలి కదా? కానీ వాళ్ళు మనం చెప్పింది వినకపోతే, మన గోల ఎలా అర్థం అవుతుంది ? పోనీ, ఈ మధ్య వాళ్ళు చెప్పేది కూడా అర్థం కాకుండా తయారయ్యింది కదా ? …
ట్రంప్ విపరీత వాగుడు చుట్టూ, మోడీ మూడేళ్ళ పాలన చుట్టూ, బాహుబలి సినిమా collections చుట్టూ తిరుగుతున్న సామాన్య ప్రజలు, తన లాంటి మేధావి మాటల్ని ఈ మధ్య పట్టించుకోవట్లేదని సో.లో. మేధావి కి అర్థం అవుతూ ఉంది.
ఇదే కాదు.. ఇంకా చాలా చాలా విషయాలు, ఈ మధ్యకాలం లో, కొత్తగా అతనికి అర్థం
అవుతున్నాయి ….
కానీ అర్థం కానిదల్లా “ఎందుకిలా..?”
*********************
సో. లో. మేధావి ..అసలు పేరు…
ఆగండాగండి ! .అప్పుడే చెప్పేస్తే కిక్కెక్కడుంది..
ఆ మధ్య “నిజాలు నిలకడ మీద తెలుస్తాయన్నారు” కదా, మన జైపాల్ రెడ్డి గారి లాంటి పెద్దలు….
సరే.
సో. లో. అనే ముద్దు పేరు మాత్రం ఆ మధ్య ఎప్పుడో US లో పరిచయమైన J.Lo. పేరు చూసి inspire అయ్యి పెట్టుకున్నది కాదు.. Latest ట్రెండ్ అంతా ‘రా.గా’ మరియు ‘న.మో.’ కదా … పైగా ఇలాంటి ‘మారుపేర్లు’ ఉన్నవాళ్ళందరూ జగమెరిగిన మేధావులాయె ..
పుట్టింది జంబూ ద్వీపే, కృష్ణ గోదావరి etc. etc. నదుల మధ్య ప్రదేశమే అయినా, ప్రపంచం మొత్తం అప్పుడప్పుడు చుట్టి వచ్చాడు. మాయబజార్ సినిమాని, గోదావరి తీరాన్ని, ఆవకాయ పచ్చడిని, చింతపండు చారుని, EVV సినిమాలో వెటకారాన్ని నచ్చుకునే సగటు తెలుగువాడు, ఠాట్ … తెలుగు మేధావి, మన సో. లో. మేధావి !
ఇక్కడో విషయం చెప్పాలి.. ఈ మేధావుల్లో రెండు రకాలు ఉంటారు ..( రెండు కాకుండా నలభై రెండు రకాలు ఉన్నా కూడా, మనం చెప్పు కోవాల్సింది ఈ రెంటిని గురించే. అందుకే, బుద్ధిగా చెప్పేది వినండి!).
మొదటిది ‘మాంచి’ తెలివి తేటలు ఉన్నవారు, రెండోది ‘మాంచి’ తెలివి తేటలు + తెంపరితనం ఉన్నవారు – ఇది deadly కాంబినేషన్ – సుబ్రమణ్య స్వామి లా అన్నమాట 🙂 మన కథ వరకు, ఇవి మొదటి రకం & రెండో రకం అనుకుందాం.
మన పురాణాలలో చెప్పినట్టు గొప్ప గొప్ప వాళ్ళకి అప్పుడప్పుడు కనువిప్పు కలిగే సంఘటనలు జరుగుతుంటాయి..
సిద్ధార్దుడికి ‘ఒకానొక బోధి చెట్టు’ దగ్గరే జ్ఞానబోధ అయినట్టు బుద్దుడి గా మారినట్టు, దేనికైనా టైం రావాలి కదా …
మన సో. లో. మేధావి మొదటి రకం నుండి రెండో రకానికి మధ్య ఉన్న అదోరకమైన ‘సంధి’ స్టేజి లో (తెలుగు డిక్షనరీ వెతుక్కోవద్దు, ఇంగ్లీష్ లో ‘ట్రాన్సిషన్’ అంటారు) ఉన్నాడు. ‘ఉన్నాడు’ అనేదాని కన్నా ఈ సంధి స్టేజి కి పంపబడ్డాడు అనేది correct update!
ఎందుకంటే, ఈ మధ్య సో. లో. మేధావికి ఆపాదమస్తకం కంపనం వచ్చే సంఘటనలు నాలుగైదు జరిగాయి. (నిలువెల్లా కంపరం కాదు స్వామి, నిలువెల్లా కంపనం – English లో shivering !
మనం బుద్ధిగా ‘Queue’ లో నిల్చుంటే, మనల్ని తోసుకుంటే ముందుకు వెళ్లే చదువుకున్న పెద్దమనిషి ని చూస్తే వస్తుందే అది; పార్కింగ్ నుంచి కారు వెనక్కి తీస్తుంటే , అడ్డంగా two-wheeler park చేసి వెళ్లే పెద్దమనిషి ని చూస్తే వస్తుందే అది ….నిలువెల్లా కంపనం !
ఈ విపరీత లక్షణాలన్నీ ‘Intellectual Trauma’ లో భాగమట ! ఈ విషయం, ఆ మధ్య కలిసినప్పుడు సో.లో. కి విదేశాల్లో ఉంటున్న ఒక విదూషీమణి చెప్పింది.
అసలే ఉన్న కన్ఫ్యూషన్ కి తోడు, ఈ కొత్త phrase ఒకటి.
ఇంతకీ ‘Intellectual Trauma’ అంటే ‘Intellectuals వలన వచ్చే Trauma నా’ లేక ‘Intellectuals కు వచ్చే Trauma నా’ లేక ‘Intellect కి వచ్చే trauma నా’ అన్నది సో.లో. కి ఎంత బుర్ర చించుకున్నా, రామ్ గోపాల్ వర్మ ట్వీట్ లా, అర్థం కాలేదు.
సరే. మన సో.లో. మేధావిని ‘తొండ’ నుంచి ‘ఊసరవెల్లి’ స్టేజి లోకి (సిద్ధార్దుడి నుండి బుద్ధుడు అని వాడొచ్చు, కానీ మనకు మాంచి impact కావాలి కదా!) పంపించేందుకు, ఆ సకల జగన్నాటక సూత్రధారి, సృష్టించిన ‘లీలలు’ చూద్దాం …ష్…విందాం మరి.
ఆ మధ్య, టీవీ లో ‘Believe it or not’ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు, కారు ఆక్సిడెంట్ లో బాడీ అంతా నుజ్జునుజ్జయి దాదాపు 52 సర్జరీలు చేస్తే గానీ, బతకని ఒకావిడ స్టోరీ చూసి సో.లో చాలా ఆశ్చర్యపోయాడు. ఇంత ఘోరమైన ఆక్సిడెంట్ కి కారణమేమంటే – కారు డ్రైవ్ చేస్తూ మొబైల్ పవర్ బ్యాంక్ గురించి ఆవిడ వెతకడం, ఆ పవర్ బ్యాంకు ఉన్న dashboard lock అయ్యి ఉండడం, ఆ dashboard keys కారు తాళం గుత్తి లోనే ఉండడం, ఇంకో ఆలోచన లేకుండా రన్నింగ్ లోనే ఆవిడ కారు తాళం తీసి dashboard ఓపెన్ చెయ్యడానికి ట్రై చెయ్యడం ! ఇది చూసాక మనుషుల్లో, అందులో కారు డ్రైవ్ చేసే వాళ్లలో ఇంత తెలివైన వాళ్ళు ఉంటారా అని మొదటిసారి అవతలి వాళ్ళ మేధావితనం మీద సో.లో కి పెద్ద డౌట్ మొదలయ్యింది.
ఆ తరువాత, ఆ మధ్య జరిగిన demonetization ద్వారా వెనక్కి వచ్చిన నల్లధనం (నాకు లెక్కలు తెలియవు స్వామి!) అంతా మోడీ గారు ATM ద్వారా సామాన్య ప్రజలకి పంచుతున్నారని పొద్దున్న నుండి ATM ల దగ్గర బ్యాంకుల దగ్గర క్యూ లో తోసుకుంటున్న జనాన్ని టీవీ ల్లో చూసి, మళ్ళీ సో.లో కి ‘మేధావితనం’ మీద doubts మొదలయ్యాయి.
‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలో రాంబాబు (రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్) ‘after one year I will be king’ అంటూ ఉంటాడు. అలా, ‘after 2 years I will be CM’ అంటూ ఉన్న రాజకీయ నాయకులను చూసాక, సో.లో కి ఈ doubts ఇంకా పెద్దవయ్యాయి.
ఈ doubts అన్నీ కలపి ‘ఇంతింతై వటుడింతయి’ అన్నట్టు, ‘చెలియలి కట్ట’ దాటే సంఘటన ఈ మధ్యే సో.లో కి ఎదురైంది. (BTW, ‘చెలియలి కట్ట’ అనే పదం విన్నది విశ్వనాథ సత్యనారాయణ గారు వ్రాసిన ‘చెలియలి కట్ట’ అనే నవల చదివిన తరువాత. ఒక విషయం మాత్రం నిజం, అది చదివితే విశ్వనాథ సత్యనారాయణ గారి మీద ఉన్న conservative రైటర్ అనే ఒపీనియన్ మారి పోతుంది). టీవీ లో ఒక మహానుభావుడు ‘బి.కామ్. లో physics ఉంటది’ అనడం చూసి, సో.లో. కి – పైన వివరంగా చెప్పిన – ‘నిలువెల్లా కంపనం’ మొదలయ్యింది.
అప్పుడెప్పుడో, అక్బరు బీర్బల్ ని ‘నా రాజ్యం లో అందరి కన్నా తెలివితక్కువాడు ఎవడో కనిపెట్టమని’ పంపించాట్ట !
అలా, ఈ తరహ కనువిప్పు సంఘటనల వలన, మన చుట్టూ ఉండే ‘మేధావితనం’ గురించి, మన సో.లో. మేధావి అన్వేషణ మొదలయ్యింది.
(ఇంకా ఉంది)